తరుణి స్వచ్ఛంద సంస్థ 2000 సంవత్సరంలో బాలలు మరియు స్త్రీల అభివృద్ధి, హక్కుల సాధనకు ఏర్పాటు చేయబడినది. సమాజంలో స్త్రీలు పురుషలతో సమానంగా అవకాశాలు, హక్కులు పొందేటట్లు చూడాలనే ముఖ్య ఉద్దేశ్యం తో ఏర్పడింది. గత 20 సంవత్సరాలుగా తరుణి సంస్థ తెలంగాణ రాష్ట్రంలో బాల్యవివాహాలు, భ్రూణ హత్యలు, బాలల అక్రమ రవాణా, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు పాటు పడుతోంది. తరుణి బాలికా సంఘాలు ఏర్పాటు చేసి దాదాపు 18 వేల మంది బాలికల బ్రతుకులలో వెలుగులు నింపింది. వందల కొలది బాల్యవివాహాలు ఆపడం మరియు బాల్య వివాహ చట్టంలో మార్పులు తీసుకురావడంలో ప్రధాన భూమిక పోషించడం తరుణి సాధించిన విజయాలు. తెలంగాణ పోలీసులు అత్యాచార బాదితుల కొరకు ఏర్పాటు చేసిన భరోసా సెంటర్ల ఏర్పాటు మరియు నడపడంలో తరుణి ఒక టెక్నికల్ పార్ట్నర్ గా సేవలు అందిస్తోంది. వరంగల్ జిల్లాలో జిన్నింగ్ మిల్లులలో మరియు ఇటుక బట్టీలలో బాలలు పని చేయకుండా చూడడంలో విజయం సాధించింది. బాలలు, అక్రమ రవాణాకు గురి కాకుండా వారి నైపుణ్యాలను అభివృద్ధి చేసి, స్వశక్తితో ముందుకు సాగడానికి దోహదపడుతోంది తరుణి.
తరుణి బ్రిటిష్ డిప్యూటీ హై కమిషన్ హైదరాబాద్ తో కలిసి యాదాద్రి భువనగిరి జిల్లాలో అక్రమ రవాణా నిరోధించడానికి పనిచేసింది.
ప్రస్తుతం బ్రిటిష్ డిప్యూటీ హై కమిషన్, హైదరాబాద్ మరియు మహిళా భద్రతా విభాగం తెలంగాణ పోలీస్ వారితో కలిసి తెలంగాణ రాష్ట్రంలోని మానవ అక్రమ రవాణా నిరోధించడానికి ఏర్పడిన ప్రత్యేక పోలీస్ యూనిట్లు – AHTU లలో పనిచేస్తున్న పోలీస్ అధికారులకు మరియు ఇతర స్టేక్ హోల్డర్స్ కు శిక్షణ ఇవ్వడం, ద్విభాషా వెబ్ పోర్టల్ మరియు ఈ లెర్నింగ్ కోర్సు ద్వారా అందరికీ అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తోంది.